ఈశాన్య రాష్ట్రం అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం తెలుగోడికి దక్కింది. శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఐఏఎస్ అధికారి కోట రవిని నియమిస్తూ అసోం ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన కోట రవి.. అసోం క్యాడర్ 1993 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇంతకు ముందు అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో ఆర్థిక దౌత్యాధికారిగా ఆయన పనిచేశారు. పర్యావరణ, అటవీ, భూ సంరక్షణ విభాగాల్లో ప్రత్యేక సీఎస్‌గా.. ఢిల్లీలోని అసోం భవన్‌లో రెసిడెంట్ కమిషనర్‌గానూ ఉన్నారు.
ప్రస్తుతం అసోం ప్రభుత్వంలో 18 శాఖలకు అదనపు కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ రవి… ఇటీవల ఉల్ఫా తీవ్రవాదులతో జరిగిన శాంతి ఒప్పందంలోనూ కీలక పాత్ర పోషించారు. రవి పనితీరును గుర్తించిన హిమంత బిశ్వశర్మ ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఈ నియామకంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సీఎస్ పవన్ కుమార్ బోర్తకూర్ పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో రవి బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎస్‌గా కోత రవితో పాటు అదనపు కార్యదర్శులుగా ఉన్న రవిశంకర్ ప్రసాద్, సైదైన్ అబ్బాసీ, ఆశిష్ కుమార్ భుటానీలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా నియమించింది.