Andhra Pradesh Elections 2024: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వై నాట్ 175 అంటూ మరోసారి అధికారమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని.. జనసేనతో కలిసి టీడీపీ కసరత్తు మొదలుపెట్టింది. అయితే.. ఇప్పటికే ఎన్నికల ప్రణాళిక అమలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చుతుండగా.. వాళ్లంతా తమ భవిష్యత్తు కోసం కండువాలు మార్చే పనులు ప్రారంభించారు. అటు టీడీపీలో కూడా జంపింగ్ జపాంగుల పర్వం స్టార్ట్ అయ్యింది. ఇదంతా ఒక ఎత్తయితే.. ప్రస్తుతం కాపునేత ముద్రగడ పద్మనాభం చుట్టూ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి.
కాపు సమాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న ముద్రగడను తమవైపు తిప్పుకుంటే.. ఆ వర్గపు ఓట్లు తమకే వస్తాయన్న స్ట్రాటజీతో పార్టీలు పావులు కదుపుతున్నాయి. అయితే.. ప్రస్తుతం ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్న ముద్రగడను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ముద్రగడను కలిసేందుకు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా.. కనీసం కలవడానికి ఇష్టపడలేదని సమాచారం. తోట త్రిమూర్తులు వచ్చినా కలవనని ముద్రగడ తేల్చి చెప్పేశారంటా.