- ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందికి అవకాశం
- సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి జనవరి 29న మొదటి ప్రత్యేక రైలు
- మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు రైళ్లు
అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూర్తి కావడంతో రేపటి నుంచి సామాన్య భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్వర్యంలో అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ రైళ్లలో 20 బోగీలు ఉండగా… 1,400 మంది ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ రైళ్లు వివిధ తేదీలలో సికింద్రాబాద్, కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరనున్నాయి.
ఏ తేదీన ఏ నియోజకవర్గం రైలు?
ఈ ప్రత్యేక రైళ్లు ఒక్కో లోక్ సభ నియోజకవర్గానికి చెందిన భక్తులతో ఒక్కోరోజు బయలుదేరనున్నాయి. మొదట సికింద్రాబాద్ లోక సభ నియోజకవర్గం రైలు జనవరి 29న బయలుదేరుతుంది. ఆ తర్వాత వరంగల్ – జనవరి 30, హైదరాబాద్ – జనవరి 31, కరీంనగర్ – ఫిబ్రవరి 1, మల్కాజిగిరి – ఫిబ్రవరి 2, ఖమ్మం – ఫిబ్రవరి 3, చేవెళ్ల – ఫిబ్రవరి 5, పెద్దపల్లి – ఫిబ్రవరి 6, నిజామాబాద్ – ఫిబ్రవరి 7, ఆదిలాబాద్ – ఫిబ్రవరి 8, మహబూబ్ నగర్ – ఫిబ్రవరి 9, మహబూబాబాద్ – ఫిబ్రవరి 10, మెదక్ – ఫిబ్రవరి 11, భువనగిరి – ఫిబ్రవరి 12, నాగర్ కర్నూలు – ఫిబ్రవరి 13, నల్గొండ – ఫిబ్రవరి 14, జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం రైలు ఫిబ్రవరి 15న బయలుదేరుతుంది.
ఎవరు ఎక్కడ ఎక్కాలి?
సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, మల్కాజిగిరి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల భక్తులు సికింద్రాబాద్‌లో రైలు ఎక్కవలసి ఉంటుంది. నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్ నియోజకవర్గాలకు చెందినవారు కాజీపేటలో రైలు ఎక్కవలసి ఉంటుంది.