- ఉరవకొండలో రా కదలిరా సభ
- సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు
- రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరూ తనకు స్టార్ క్యాంపెయినర్లేనని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ పీలేరు, ఉరవకొండలో ఏర్పాటు చేసిన రా కదలి రా సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉరవకొండ సభలో సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక తానే ఉన్నానని, వైఎస్ కుటుంబంలో తానే చిచ్చు పెట్టానని వైసీపీ నేతలు ఆరోపిస్తుండడం పట్ల మండిపడ్డారు. చంద్రబాబుకు పొరుగు రాష్ట్రంలో, ఇతర పార్టీల్లోనూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
“అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్లు అంట. ఈయన చేసింది తప్పు అని ఎవరైనా అంటే చాలు… నాకు స్టార్ క్యాంపెయినర్లు అనో, నా మనుషులు అనో వాళ్లపై ముద్ర వేసేస్తున్నారు.
ఎప్పుడైతే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయో వీళ్ల పతనం ప్రారంభమైంది. అక్కడ్నించి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. నువ్వు, మీ చెల్లెలు కొట్టుకుంటే… మీ చెల్లెలు వెళ్లి కాంగ్రెస్ లో కలిస్తే, వాళ్లు ఆమెకు పదవి ఇస్తే… దానికి కూడా నేనే కారణమా? ఆవిడకు కూడా నేనే స్క్రిప్టు ఇస్తున్నానంట.
అంటే, ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, నీ వల్ల ఎవరు బాధపడి బయటికొచ్చినా వారు నాకు స్టార్ క్యాంపెయినర్లేనా? యస్… ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరూ నా స్టార్ క్యాంపెయినర్లే. ఉద్యోగం రాని యువత నా స్టార్ క్యాంపెయినర్. నష్టపోయిన రైతులు నాకు స్టార్ క్యాంపెయినర్లు” అంటూ చంద్రబాబు వాడీవేడిగా ప్రసంగించారు.