నగరి నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగతున్న రోజాకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి టికెట్ దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతోన్న వేళ ఓ ఆసక్తికర వార్త తెర మీదకు వచ్చింది. ఆమెను ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో వైఎస్సార్సీపీ అధిష్టానం ఉందని తెలుస్తోంది. ఇటీవల విజయసాయి రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారని సమాచారం.
2019లో ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించడానికి సీఎం జగన్ సుముఖంగా లేరు. తన షరతులకు అంగీకరిస్తేనే మాగుంటకు టికెట్ ఇస్తానని జగన్ చెప్పారని సమాచారం. అయితే ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇప్పించేందుకు బాలినేని శ్రీనివాస రెడ్డి చివరి వరకూ ప్రయత్నించారు.
ఒంగోలు ఎంపీగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని పోటీ చేయించాలని వైఎస్సార్సీపీ నాయకత్వం భావించినప్పటికీ.. జిల్లా నేతలు వ్యతిరేకించడంతో.. ఎవరిని ఒంగోలు నుంచి బరిలోకి దింపాలనే చర్చ జరిగింది. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి కల్పించుకొని.. ఒంగోలు ఎంపీగా రోజా పేరు పరిశీలనలో ఉందని చెప్పారట. ఒకట్రెండు రోజుల్లో ఖరారు కావచ్చిన ఆయన చెప్పారట.