ఇప్పటికే 50కి పైగా స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. అటు ప్రచారంలోనూ స్పీడ్ పెంచేలా జనవరి 25 నుంచి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేలా సీఎం జగన్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణ వేగవంతమైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో.. మేనిఫెస్టో ఫైనల్ చేయడంతో పాటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.
మార్పు.. రెండక్షరాలే కానీ ఇప్పుడు ఆ పదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. ఆ గట్టున కూడా మార్పు మాట రాజకీయాల్లో కొత్తబాట వేస్తోంది. వైనాట్ 175 టార్గెట్‌గా అధికార వైసీపీ అభ్యర్థుల మార్పు ప్రక్రియ అల్రెడీ పట్టాలెక్కింది. ఇక టీడీపీ -జనసేన మధ్య సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. పొత్తులో భాగంగా చేర్పు కోసం ఎక్కడెక్కడ మార్పులుంటాయన్న చర్చ మొదలైంది. వాటి సంగతి ఎలా వున్నా.. మార్పే లక్ష్యం..పొత్తే మార్గం అంటూ టీడీపీ-జనసేన ఒక్కటిగా ఒకే వేదికపై వచ్చాయి.
ఇప్పటికే 50కి పైగా స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. అటు ప్రచారంలోనూ స్పీడ్ పెంచేలా జనవరి 25 నుంచి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేలా సీఎం జగన్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణ వేగవంతమైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో.. మేనిఫెస్టో ఫైనల్ చేయడంతో పాటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. పార్టీల్లోకి పలువురు నేతల చేరికల నేపథ్యంలో చంద్రబాబు, పవన్ వరుసగా భేటీ అవుతున్నారు. తాజాగా మరోసారి వీళ్లిద్దరి భేటీ కాబోతున్నారు. ఎల్లుండి లేదంటే పండగ తర్వాత ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు.
అమరావతిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగే భోగి వేడుకల్లో చంద్రబాబుతోపాటు జనసేనా అధ్యక్షులు పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు మందడంలోని గోల్డెన్ రూల్ స్కూల్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా వినూత్న రీతిలో భోగి పండుగను జరుపుకోవాలని రెండు పార్టీ అధినేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేసి నేతలు నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ రాత్రికి చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ డిన్నర్ మీటింగ్‌లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు రెండు గంటల సేపు వీరు చర్చలు జరిపే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా వీరు చర్చించనున్నారు. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి? అనే విషయంపై చర్చలు జరుపనున్నట్లు సమాచారం.
అయితే తెలుగుదేశం పార్టీ తన తొలి జాబితాను సంక్రాంతి రోజున విడుదల చేయాలని భావిస్తున్న తరుణంలో ఈ డిన్నర్ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 20 నుంచి 25 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయడానికి టీడీపీ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎటువంటి వివాదాలు లేని, జనసేన కోరుకోని నియోజకవర్గాలను మాత్రమే ఎంపిక చేసి అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు, టెక్కలి నుంచి అచ్చెనాయుడు, మంగళగిరి నుంచి నారా లోకేష్ వంటి పేర్లు తొలి జాబితాలో ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఇక జనసేనతో సీట్ల సర్దుబాటు, షెడ్యూల్ విడుదలైన తర్వాత ఫిబ్రవరిలో మరిన్ని జాబితాలు వెలువడే అవకాశముందని సమాచారం.