ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈసారి టీడీపీ, జనసేన కలిసి పోటే చేసేందుకు నిర్ణయం తీసుకోగా.. ఉమ్మడి కార్యచరణపై ఆ రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబ, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ల మధ్య శనివారం మరోసారి కీలక భేటీ జరిగింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా పవన్‌ను చంద్రబాబు భోజనానికి ఆహ్వానించగా.. జనసేన కీలక నేత మనోహర్‌తో కలసి శనివారం రాత్రి ఉండవల్లిలోని ఆయన నివాసానికి పవన్ చేరుకున్నారు.
దాదాపు మూడు గంటల పాటు పవన్, చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై ఇప్పటికే దాదాపు ఒక అంగీకారానికి వచ్చిన ఇరు పార్టీల నేతలు… ఆ విషయంలో చేయాల్సిన కొన్ని సర్దుబాట్లు, ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలు, మేనిఫెస్టో విడుదల సమయంతో పాటు రెండు పార్టీలు ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, చంద్రబాబు, పవన్ కలసి పాల్గొనాల్సిన సభల వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియను సాఫీగా కొలిక్కి తేవడంతో పాటు ఇతర పార్టీల నుంచి చేరేందుకు ఆసక్తి ఉన్న నాయకులెవరు.. వారిని చేర్చుకునే విషయంలో ఎలాంటి విధానం అనుసరించాలి.. వచ్చినవారిలో ఎవరికి టికెట్లు ఇవ్వగలం.. వంటి పలు అంశాలపై ఈ భేటీలో నేతలు చర్చించినట్లు తెలిసింది.
వైసీపీ ఇప్పటికే మూడు జాబితాల్ని ప్రకటించగా.. నాలుగో జాబితాకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన అభ్యర్థుల్ని ఖరారు చేసే ప్రక్రియను వేగవంతం చేయడంపై చర్చ జరిగినట్లు సమాచారం. అభ్యర్థులను ఎప్పడు ప్రకటించాలి.. తొలి జాబితాలో ఎంత మందికి చోటు కల్పించాలి.. రెండు పార్టీల అభ్యర్థుల జాబితాలు ఉమ్మడిగా విడుదల చేయాలా.. వంటి పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల వంటి అంశాలపైనా చర్చించినట్లు సమాచారం. టీడీపీ ‘సూపర్‌సిక్స్’కి జనసేన జోడించిన ‘షణ్ముఖ వ్యూహం’ అంశాల్ని కలిపి ఇప్పటికే రెండు పార్టీలు ఉమ్మడి మినీ మేనిఫెస్టోను జనంలోకి తీసుకెళ్లాయి. దానిపై ప్రజల స్పందనేంటి, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా తుది మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలేంటి అన్న కోణంలో వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.