తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందింది. పవిత్రమైన ధనుర్మాసం ఆదివారం రోజుతో ముగిసిన నేపథ్యంలో.. సోమవారం ఉదయం నుంచి తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో సుప్రభాత సేవ తిరిగి ప్రారంభమైంది. కిందటేడాది డిసెంబర్ 17వ తేదీ తెల్లవారు జామున నుంచి ధనుర్మాసం ఘడియలు ప్రారంభమైన తరుణంలో.. సుప్రభాత సేవ నిలిచిపోయింది. దీంతో అప్పుడు శ్రీవారి ఆలయంలో.. సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. ఇప్పుడు ధనుర్మాసం ముగియగా.. జనవరి 15 నుంచి యథాతథంగా శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించినట్లు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
ఇప్పుడు జనవరి 16న ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పూట పార్వేటమండపం వద్ద పార్వేటఉత్సవం జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో తిరుమల శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జనవరి 14న భోగితేరు, జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినాలు జరగనున్నాయి.
ఇక సంక్రాంతి, కనుమ పండగను పురస్కరించుకొని జనవరి 16వ తేదీ మంగళవారం రోజు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ శాలలో గోపూజ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు వేణుగానం, దాసాహిత్య ప్రాజెక్ట్ కళాకారులతో కోలాటం, వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో భక్తి సంకీర్తనల ఆలాపన జరగనున్నాయి. దీని కోసం తదనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇంకా శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో హారతి, గోపూజ, గొబ్బెమ్మ వేడుక, తులసీ పూజ, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహణ వంటివి ఉన్నాయని అధికారులు తెలిపారు. తర్వాత హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి హరిదాసులు, బసవన్నల నృత్యాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.