కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోదరి ఇవాళ కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరిబెన్ ప్రదీప్ షా (68) ముంబైలోని ఆస్పత్రిలో ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమిత్ షా కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ముందస్తుగా షెడ్యూల్ చేసిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్న అమిత్ షా.. తన షెడ్యూల్‌లో మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఇవాళ ఉదయమే రెండు పబ్లిక్ ఈవెంట్స్ నిర్వహించాల్సి ఉండగా.. వీటిని రద్దు చేసుకున్నారు. తన సోదరి మరణవార్త విన్న వెంటనే ముంబైకి పయనమయ్యారు. ఆమె అంత్యక్రియల్లో పాల్గొననున్నారు షా.
ముంబై గిర్గావ్‌లోని HN రిలయన్స్ ఆస్పత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్న సమయంలో ఇటీవల అమిత్ షా.. ఆమెను పరామర్శించారు. ఊపిరితిత్తుల మార్పిడి ప్రక్రియ కోసం ఆస్పత్రిలో చేరగా.. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె చికిత్సకు సంబంధించి దగ్గరుండి ఆస్పత్రి వర్గాలతో మాట్లాడారు. అదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సహా దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కూడా షాను ఆస్పత్రిలో కలిశారు. రాజేశ్వరిబెన్ ఆరోగ్యం గురించి అమిత్ షా ను అడిగి తెలుసుకున్నారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో అహ్మదాబాద్‌లోని థాల్‌తేజ్ శ్మశానవాటికలో రాజేశ్వరిబెన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అమిత్ షా కూడా హాజరుకానున్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని గుజరాత్‌కు ఇవాళ తరలించనున్నారు.