12.1 C
Delhi
Tuesday, December 24, 2024

Advertsie Now

spot_img

Nara Chandrababu Naidu : ఇవన్నీ చేయడానికి వీళ్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడంలేదు: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పులివర్తి నానీని పరామర్శించారు. దొంగ ఓట్ల అంశంపై నిరాహార దీక్ష చేపట్టిన పులివర్తి నాని అస్వస్థతకు గురికావడంతో ఆయనను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె వచ్చిన చంద్రబాబు… ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి చంద్రగిరిలో ఇంట్లోనే చికిత్స పొందుతున్న పులివర్తి నానితో మాట్లాడారు.

అనంతరం, మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయంటూ ధ్వజమెత్తారు. ఎక్కడైనా ఎన్నికలు జరిగితే టీచర్లను, సీనియర్ అధికారులను, అనుభవం ఉన్నవారిని సిబ్బందిగా నియమిస్తారని, కానీ రాష్ట్రంలో అందుకు భిన్నంగా జరుగుతోందని విమర్శించారు. వీళ్లకు అనుకూలంగా ఉండే సచివాలయం సిబ్బందిని నియమించి, ఓట్ల అవకతవకలకు గేట్లెత్తారని ఆరోపించారు.

చంద్రగిరిలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారు… తిరుపతి, పీలేరు, శ్రీకాళహస్తి, సత్యవేడులోనూ దొంగ ఓట్లు చేర్చారు… పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేస్తుంటే అధికారులు ఏంచేస్తున్నారు? కొన్ని చోట్ల పోలింగ్ బూత్ లు మార్చేశారు అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఒక వ్యక్తికి మూడు బూత్ ల్లో ఓటు ఉందని వెల్లడించారు.

ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘం స్పందించి తిరుపతి జిల్లా కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిపారు. అక్రమాలు చేసిన అధికారులను జైలుకు పంపించే అవకాశం ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం పులివర్తి నాని చేసే పోరాటం ధర్మపోరాటం అని ప్రశంసించారు. ప్రజలు కూడా దీన్ని గుర్తించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

“ఇన్ని అక్రమాలు చేయడానికి వీళ్లకు డబ్బులు ఎక్కడ్నించి వస్తున్నాయో అర్థం కావడంలేదు. మొన్నటి వరకు ఈ జిల్లాలో ఎన్నడూ చూడని విధంగా అవకతవకలు జరుగుతున్నాయి. నేను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ జీవితంలో మునుపెన్నడూ లేనంతగా మనీ పవర్ కనిపిస్తోంది. భూ కబ్జాలు చేస్తున్నారు, దోచుకుంటున్నారు… ఆ డబ్బులు తీసుకువచ్చి ప్రజలను మభ్యపెట్టే విధంగా యధేచ్ఛగా పంపిణీ చేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలకు ఇది పరాకాష్ఠ.

ఇక మీదట ఇవి జరగవు… ప్రజలు నిర్ణయించుకున్నారు… మిమ్మల్ని ఇంటికి పంపించడం నూటికి వెయ్యి శాతం ఖాయం. నేను ఒక్కటే హెచ్చిరిస్తున్నా… మేం ఎట్టి పరిస్థితుల్లోనూ దేన్నీ వదిలిపెట్టం. అధికారులు కూడా జాగ్రత్తగా ఉండండి… చట్టప్రకారం వెళ్లండి. చట్టాలను ఉల్లంఘించి మీ ఇష్ట  ప్రకారం చేస్తే… చట్ట ప్రకారం మిమ్మల్ని బోనులో నిలబెడతాం.

మీరు అక్రమాలు చేస్తే ఎన్నికల సంఘానికి, డీవోపీటీకి లేఖలు రాస్తాం, చివరికి కోర్టుకు కూడా వెళతాం. మీరు చేసిన అక్రమాలను బయటపెట్టి, మిమ్మల్ని శిక్షించే వరకు వదిలిపెట్టం” అని చంద్రబాబు హెచ్చరించారు.

రాష్ట్రంలో 8-9 నియోజకవర్గాల్లో ఓట్ల అక్రమాలు భారీ ఎత్తున జరిగాయని, వాటన్నింటి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు. తాను గతంలో అనేక ఎన్నికలు చూశానని, తనకు ఇది పదో ఎన్నిక అని చంద్రబాబు వెల్లడించారు. తన జీవితంలో ఎప్పుడూ చూడనంతగా ఈసారి అవకతవకలు చేస్తున్నారని వివరించారు. ఏ రాష్ట్రంలోనూ తాము ఇలాంటి అవకతవకలు చూడలేదని ఎన్నికల సంఘం అధికారులు కూడా చెప్పారని వెల్లడించారు.

మొన్న తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తే, అక్కడ ఇలాంటి అక్రమాలేవీ జరలేదని అన్నారు. ఏపీలోనే ఇలా ఎందుకు జరుగుతున్నాయంటే… ఇక్కడ ప్రభుత్వమే దోషి అని స్పష్టం చేశారు. అధికారులను కూడా నేరస్తులుగా తయారుచేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానంపై గట్టి  చర్యలు తీసుకునేలా తాము ఈసీ దృష్టికి తీసుకెళతామని అన్నారు. ఇక, బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా… ఆ విషయం చెప్పేందుకు ఇది తగిన వేదిక కాదని, ఇక్కడ మాట్లాడుతున్నది వేరే అంశం అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నకు సమాధానంగా… త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles