సంక్రాంతి పండుగకు స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లిన చంద్రబాబు కుటుంబం.. సోమవారం ఉదయం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించింది. నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ దేవతల గుడికి వెళ్లిన చంద్రబాబు.. ముందుగా సత్యమ్మకు పూజలు చేశారు. అనంతరం నాగాలమ్మ గుడికి వెళ్లి కొబ్బరి కాయలతో మొక్కు చెల్లించుకున్నారు. ఆ తరువాత తన తల్లిదండ్రుల సమాధి వద్దకు వెళ్లి చంద్రబాబు నివాళులు అర్పించారు. చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ తో పాటు చిన్నా పెద్దా అందరూ నాగాలమ్మకు మొక్కులు చెల్లిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రబాబు, లోకేశ్ రాకతో నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి.
ఏటా సంక్రాంతి పండుగను నారావారిపల్లెలో జరుపుకోవడం చంద్రబాబు కుటుంబానికి ఆనవాయితీ. ఈ ఏడాది కూడా పండుగకు ఆయన కుటుంబంతో కలిసి ఆదివారం హెలిక్యాప్టర్ లో ఏ.రంగంపేటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ చంద్రబాబు కుటుంబానికి ఘన స్వాగతం లభించింది. స్థానిక నేతలు చంద్రబాబు, లోకేశ్ లకు స్వాగతం పలికారు. ఆక్కడి నుంచి కార్లలో నారావారిపల్లెకు చేరుకున్నారు. కాగా, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా దేవాన్ష్ తదితరులు రెండు రోజుల క్రితమే నారావారిపల్లెకు వచ్చారు.