దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో భారత కుర్రాళ్ల జట్టు గెలుపు బోణీ కొట్టింది. ఇవాళ బ్లూంఫోంటీన్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో 84 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది. 252 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన బంగ్లాదేశ్ ను 45.5 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూల్చింది. భారత బౌలర్లలో సౌమీ పాండే 4 వికెట్లతో రాణించాడు. ముషీర్ ఖాన్ 2, రాజ్ లింబానీ 1, అర్షిన్ కులకర్ణి 1, ప్రియాన్షు మోలియా 1 వికెట్ తీశారు.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో అత్యధికంగా మహ్మద్ షిహాబ్ జేమ్స్ 54 పరుగులు చేయగా, ఆరిఫుల్ ఇస్లాం 41 పరుగులు సాధించాడు. అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది.
పాకిస్థాన్ కూడా గెలిచింది!
ఇవాళ జరిగిన ఇతర మ్యాచ్ ల్లో పాకిస్థాన్ జట్టు ఆఫ్ఘనిస్థాన్ పైనా… ఇంగ్లండ్ జట్టు స్కాట్లాండ్ పైనా గెలిచాయి. ఈస్ట్ లండన్ లో నేడు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 284 పరుగులు చేసింది. ఓపెనర్ షాజైబ్ ఖాన్ (106) సెంచరీతో మెరిశాడు. అనంతరం, భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ 103 పరుగులకే ఆలౌట్ అయింది.
మరో మ్యాచ్ లో ఇంగ్లండ్, స్కాట్లాండ్ ఆడాయి. పోచెఫ్ స్ట్రూమ్ లో జరిగిన ఈ పోరులో మొదట స్కాట్లాండ్ 49.2 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ కుర్రాళ్ల జట్టు 26.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.