Movie Name
Indian Police Force
- యాక్షన్ థ్రిల్లర్ గా ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’
- 7 ఎపిసోడ్స్ తో మొదలైన స్ట్రీమింగ్
- తెలుగులోను అందుబాటులోకి వచ్చిన సిరీస్
- భారీ యాక్షన్ దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణ
- ఫొటోగ్రఫీ – బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన బలం
పోలీస్ కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. అలాంటి కథలకు భారీతనం .. బలమైన తారాగణం తోడైతే ఆ కంటెంట్ నెక్స్ట్ లెవెల్లో కనెక్ట్ అవుతుంది. అలాంటి ఒక పోలీస్ కథతో రూపొందిన వెబ్ సిరీస్ గా ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అమెజాన్ ప్రైమ్ తెరపైకి వచ్చింది. రోహిత్ శెట్టి – సుశ్వంత్ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ ఢిల్లీ .. గోవా .. కాన్పూర్ .. ఢాకా .. బీహార్ .. జైపూర్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఢిల్లీలో కబీర్ మాలిక్ (సిద్ధార్థ్ మల్హోత్రా) స్పెషల్ సెల్ కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. భార్య రష్మీని కోల్పోయిన అతను, తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. ఇక అదే డిపార్టుమెంటులో విక్రమ్ ( వివేక్ ఒబెరాయ్) పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య శ్రుతి (శ్వేత తివారి) పదేళ్ల కొడుకు ఆయుష్ తో కలిసి నివసిస్తూ ఉంటాడు. కబీర్ – విక్రమ్ లకు బాస్ గా జైదీప్ బన్సాల్ (ముఖేశ్ రుషి) వ్యవహరిస్తూ ఉంటాడు.
ఇక రఫీక్ (రితూ రాజ్ సింగ్) అనే తీవ్రవాది ఇండియాలోని ప్రధానమైన నగరాలను టార్గెట్ చేస్తూ బాంబు పేలుళ్లు జరపడానికి జరార్ అలియాస్ హైదర్ (మయాంక్ టాండన్) ను ఎంచుకుంటాడు. తమ్ముడైన ‘సిక్కూ’ అతనికి సహకరిస్తూ ఉంటాడు. నఫీసా (వైదేహి) ఇంట్లో ఉంటూనే అతను ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఢిల్లీలో బాంబుపేలుళ్లు సృష్టిస్తాడు. ఆ సంఘటనల్లో ఎంతోమంది అమాయకులు మరణిస్తారు.
దాంతో బాంబు పేలుళ్లకు కారణమైన వారిని పట్టుకోవడానికి కబీర్ మాలిక్ .. విక్రమ్ .. రానా రంగంలోకి దిగుతారు. గతంలో వారితో కలిసి పనిచేసిన తార శెట్టి (శిల్పాశెట్టి) కూడా ఈ ఆపరేషన్ కోసం రప్పించబడుతుంది. జరార్ టీమ్ రహస్యంగా ఒక ప్రదేశంలో దాక్కుంటుంది. కబీర్ బృందం ఆ సమాచారాన్ని తెలుసుకుని అక్కడికి వెళతారు. జరార్ తెలివి తేటలను .. శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశామనే విషయం అప్పుడే వాళ్లకి అర్థమవుతుంది.
జరార్ నటన చూసి మోసపోయిన నఫీసా తల్లి ఆమెను అతనికి ఇచ్చి వివాహం చేస్తుంది. అతని పేరు హైదర్ అనే విషయమే నఫీసాకి తెలుసు. తాను పెర్ఫ్యూమ్స్ బిజినెస్ చేస్తున్నట్టుగా ఆమెను నమ్మిస్తాడతను. అందువలన పెళ్లి చేసుకుని అతనితో పాటు ఆమె జైపూర్ వెళుతుంది. అక్కడ బాంబుపేలుళ్లు సృష్టించడానికి జరార్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కబీర్ టీమ్ ఏం చేస్తుంది? జరార్ హింసకి వాళ్లు అడ్డుకట్ట వేయగలుగుతారా? అతను అలా మారడానికి కారణం ఏమిటి? అనే సందేహాలకు సమాధానమిస్తూ కథ ముందుకు వెళుతుంది.
కథా కథనాల పరంగా .. బడ్జెట్ పరంగా .. తారాగణం పరంగా చూసుకున్నా ఇది భారీ వెబ్ సిరీస్ అనే చెప్పాలి. సందీప్ సాకేత్ – అనూష నందకుమార్ కథ – స్క్రీన్ ను సమకూర్చారు. దేశంలో విధ్వంసం సృష్టించడానికి ఒక తీవ్రవాద వర్గం ప్రయత్నించడం … వాళ్లను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రయత్నించడమనేదే కథ. ఇలా చెప్పుకుంటే ఇంతకుముందు ఇలాంటి కథలు చాలా చూశాం కదా అనిపిస్తుంది. కానీ ఈ సిరీస్ స్క్రీన్ ప్లే పరంగా ఆసక్తికరంగా నడుస్తూ కూర్చోబెడుతుంది.
పోలీసుల యాక్షన్ .. కుటుంబాలతో ముడిపడిన ఎమోషన్స్ ను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. అలాగే తీవ్రవాది ప్రేమ .. ప్రియురాలితో అతనికి గల బాండింగ్ ను కనెక్ట్ చేస్తూ ముందుకు వెళుతుంది. సాధారణంగా పోలీస్ పాత్రలు బూతులు మాట్లాడటం ఎక్కువగా చూపిస్తుంటారు. కానీ ఈ సిరీస్ మొత్తంలో ఒక్క బూతు డైలాగ్ కానీ .. అశ్లీలతతో కూడిన సన్నివేశంగాని కనిపించవు. బాంబ్ బ్లాస్టింగ్ సన్నివేశాలను చాలా సహజంగా చిత్రీకరించారు.
ఇక పోలీస్ ల కాల్పులకు సంబంధించిన సీన్స్ .. ఛేజింగ్ సీన్స్ ను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. కథలోపోలీస్ లకు పట్టుబడకుండా ప్రధానమైన తీవ్రవాది అనేక ప్రాంతాలకు మారిపోతూ ఉంటాడు .. ఆ ప్రాంతాలలో అతని కోసం పోలీస్ లు గాలిస్తూ ఉంటారు. అలా చూసుకుంటే జైపూర్ ఎపిసోడ్ మరింత ఆకట్టుకుంటుంది. మొదటి నాలుగు ఎపిసోడ్స్ ఓ మాదిరిగా అనిపిస్తే, ఆ తరువాత మూడు ఎపిసోడ్స్ ఉత్కంఠభరితంగా నడుస్తాయి.
కథా పరంగా చాలామంది ఆర్టిస్టులు స్క్రీన్ పైకి వచ్చినప్పటికీ, ప్రధానమైన పాత్రలను రిజిస్టర్ చేయడం వలన ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రేక్షకులు ఫాలో అవుతారు. ‘గోవా’లో జరార్ అతని తమ్ముడు సిక్కూ పోలీసుల బారి నుంచి తప్పించుకునే సీన్, తన భర్త ఒక తీవ్రవాది అని తెలిసినప్పుడు నసీఫా స్పందించే సీన్ .. నఫీసా బయల్దేరిన ట్రైన్ కోసం జరార్ వెయిట్ చేసే సీన్ .. కబీర్ టీమ్ బంగ్లాదేశ్ సరిహద్దును దాటుకుని బయటపడే సీన్ ఈ సిరీస్ మొత్తంలో హైలైట్ గా అనిపిస్తాయి.
సిద్ధార్థ్ మల్హోత్రా .. వివేక్ ఒబెరాయ్ .. శిల్పా శెట్టి .. ముఖేశ్ రుషి .. మయాంక్ టాండన్ .. వైదేహి తమ పాత్రలకు న్యాయం చేశారు. లిజో జార్జ్ – చేతస్ సంగీతం, అమర్ మోహ్లే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్ కి హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. గిరీశ్ కాంత్ – రజా హుస్సేన్ కెమెరా పనితనం గొప్పగా అనిపిస్తుంది. అద్భుతమైన లొకేషన్స్ ను ఆయన ఆవిష్కరించాడు. బంటి నాగి ఎడిటింగ్ కూడా పూర్తి క్లారిటీతో కనిపిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లోని పోలీస్ కథలను ఇష్టపడేవారిని ఈ సిరీస్ నిరాశపరిచదనే చెప్పాలి.