ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. పీసీసీ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఆమె జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంతో ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 23వ తేదీన శ్రీకాకుళం జిల్లా నుంచి షర్మిల పర్యటన ప్రారంభం అవుతుంది.. ఆ రోజు పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తారు.
ఈ నెల 24న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన ఉంటుంది.. అక్కడ స్థానిక నేతలతో పార్టీ బలోపేతంపై చర్చిస్తారు. ఈ నెల 25న కాకినాడ, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళతారు. ఈ నెల 26న తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా.. 27వ తేదీన కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటన ఉంటుంది. ఈ నెల 28వ తేదీన బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. 29వ తేదీన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లా.. 30వ తేదీన శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటన ఉంది. 31వ తేదీన నంద్యాల, కడప జిల్లాలో షర్మిల పర్యటన కొనసాగుతుంది. ఇడుపులపాయతో షర్మిల పర్యటన ముగియనుంది. ఈ మేరకు షర్మిల టూర్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
సొంత లాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని.. ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని రోజూ పోరాటాల చేశారన్నారు. కేంద్రంలోని బీజేపీపై ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని మద్దతివ్వాలని టీడీపీని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తానన్నారని.. కానీ జగన్ సీఎం అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా? అని ప్రశ్నించారు.
ఏపీకి ప్రత్యేక హోదా కాదు కదా, కనీసం ప్యాకేజీ కూడా రాలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా లేదంటే ఆ పాపం అధికార, ప్రతిపక్ష నేతలు జగన్, చంద్రబాబులదే అంటూ ధ్వజమెత్తారు. ఇద్దరూ ప్రజల ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని.. వైఎస్సార్‌సీపీ టీడీపీ దొందూ దొందే అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులన్నారని.. మూడు కాదు కదా ఒక్కటి కూడా లేదన్నారు. ఈ రోజు రాజధాని ఏదంటే అర్థం కాని పరిస్థితి ఉందని.. రూ.కోట్ల అప్పులు చేసి రాజధాని కూడా కట్టలేకపోయారన్నారు. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని అన్నారని.. దాన్ని అభివృద్ధి చేశారా అంటే అదీ లేదన్నారు. దేళ్లలో పది పెద్ద పరిశ్రమలు రాలేదని.. కనీసం రోడ్లు వేయడం లేదన్నారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వడం లేదని.. తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారన్నారు.