భారత మాజీ క్రికెట్ దిగ్గజం, మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రిని బీసీసీఐ ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’తో సత్కరించనుంది. ఈ మేరకు అవార్డును అందజేయనుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 2023లో అద్భుతంగా రాణించిన యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్‌ని ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపిక చేసినట్టు వెల్లడించారు. 2019 తర్వాత తొలిసారిగా బీసీసీఐ ఈ అవార్డుల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహిస్తోంది. తొలి టెస్టుకు ముందు జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారత్, ఇంగ్లండ్ జట్ల ఆటగాళ్లు హాజరయ్యే అవకాశాలున్నాయి.
కాగా 61 ఏళ్ల రవి శాస్త్రి భారత్ తరపున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. రెండు పర్యాయాలు టీమిండియాకి కోచ్‌గా కూడా వ్యవహరించారు. 2014 నుంచి 2016 వరకు టీమిండియా డైరెక్టర్‌గా, అనంతరం టీమ్ కోచ్‌గా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. 2021 టీ20 వరల్డ్ కప్ వరకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా టెస్టు సిరీస్ విజయాలు సాధించడం రవిశాస్త్రి కోచింగ్ కాలంలో ప్రధాన ఘనతగా ఉంది. అయతే శాస్త్రి కోచ్‌గా, కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ టైటిల్స్ గెలవలేకపోయింది. 2019లో డబ్ల్యూటీసీ ఫైనల్, 2019లో వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్ వరకు టీమిండియా చేరుకోగలిగింది. ఇక యువక్రికెటర్ శుభ్‌మాన్ గిల్ 2023లో అదరగొట్టాడు. వన్డేల్లో వేగంగా 2000 పరుగులను పూర్తి చేశాడు. అందులో 5 సెంచరీలు ఉన్నాయి.