- నియోజకవర్గం మొత్తం పసుపుమయం.. వైసీపీ కనుమరుగు
- ఇన్నిరోజులూ పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు హడావుడి
- టీడీపీ అధికారంలోకి రాగానే మంగళగిరిని మార్చేస్తానన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చేశామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. నియోజకవర్గం మొత్తం పసుపుమయంగా మారిందని, అధికార పార్టీ వైసీపీ కనుమరుగైందని అన్నారు. ఈమేరకు మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ నేతలు పలువురు టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి నారా లోకేశ్ వారిని టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ఇన్నిరోజులూ మంగళగిరి నియోజకవర్గాన్ని పట్టించుకోని ప్రభుత్వం, ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ హడావుడి చేస్తోందని మండిపడ్డారు.
అధికార పార్టీ చేస్తున్న ఈ హడావుడిని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. మరో 72 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం పసుపుమయం కాబోతోందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా నియోజకవర్గాన్ని మార్చి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి తాను ఓడిపోయానని, అయినా కూడా నియోజకవర్గంలో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని లోకేశ్ గుర్తుచేశారు.