- ఐదు కోట్ల మంది ఆంధ్రులను స్టార్ క్యాంపెయినర్లు చేసి వైసీపీని భూస్థాపితం చేయాలి
- గల్లా జయదేవ్ కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారని ఆరోపణ
- నెల్లూరులో ‘రా కదలిరా’ సభలో మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల అవినీతి దారుణంగా పెరిగిపోయిందని టీడీపీ చీఫ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అవినీతి నేతలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ఆదివారం నెల్లూరులో నిర్వహించిన ‘రా కదలిరా’ సభలో చంద్రబాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరంటే.. వైసీపీ పాలనలో నష్టపోయిన ప్రతీ ఒక్కరూ, వైసీపీ నేతల బాధితులు అందరూ టీడీపీ స్టార్ క్యాంపెయినర్లేనని చంద్రబాబు చెప్పారు. టీడీపీ తరఫున ఐదు కోట్ల మంది ఆంధ్రులను స్టార్ క్యాంపెయినర్లుగా మార్చి, వైసీపీని భూస్థాపితం చేయాలని అన్నారు.
అధికార పార్టీ నేతలు ప్రతీ పనిలోనూ అవినీతికి పాల్పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. గల్లా జయదేవ్ కంపెనీని రాష్ట్రం వదిలిపోయేలా చేశారని వైసీపీ నేతలపై ఆరోపణలు గుప్పించారు. కూల్చుడు, నూకుడు, బుక్కుడు, దంచుడు, దోచుడు ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి మీరు సిద్ధమేనా అంటూ సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించారు. ఐదు కోట్ల మంది కలిసి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేసి మన బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.