ప్రధానాంశాలు:
- భీమిలి నుంచి ఏపీ సీఎం ఎన్నికల శంఖారావం
- సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించిన వైసీపీ
- చంద్రబాబు, పవన్‌లపై జగన్ తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు మరి కొద్ది రోజులే సమయం ఉండటంతో సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర నుంచి తన ప్రచారాన్ని శనివారం ప్రారంభించారు.
భీమిలిలో సిద్ధం పేరుతో వైసీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు అశేష జనవాహిని హాజరైంది.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఈ యుద్ధంలో 175కి 175 సీట్లు గెలుపే మన లక్ష్యమన్నారు. అంతేకాదు, ఎన్నికల కురుక్షేత్రంలో పాండవ సైన్యంలా తనకు మీరు కనిపిస్తున్నారని జగన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత విశాఖ జిల్లా భీమిలి నుంచి ఎన్నికల సమర శంఖారావం పూరించారు. ‘సిద్ధం’ పేరుతో భీమిలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభ నిర్వహించిన సంగివలస ప్రాంగణం జనసంద్రంగా మారిపోయింది. భారీ ఎత్తున తరలివచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలతో సభాస్థలి నిండిపోయింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు.
‘‘భీమిలిలో అటు సముద్రం, ఇటు జనసంద్రం కనిపిస్తోంది.. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం మీలో కనిపిస్తోంది.. పద్మవ్యూహంలో చిక్కుకుకోడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు.. మీ అందరి అండదండలు ఉన్నంత కాలం నేను తొణకను.. బెణకను.. ప్రతి ఇంటికి చేసిన మంచిపనితో ఈసారి చంద్రబాబు సహా ప్రతి ఒక్కర్నీ ఓడించాల్సిందే’ అని జగన్ పిలుపునిచ్చారు.