విశాఖ పట్నం
కలియుగ అవతారమైన శ్రీవేంకటేశ్వరస్వామిని ఆపద మొక్కులవాడిగా భక్తులు పిలుచుకుంటూ వుంటారు. ఎంతటి ఆపదలో ఉన్నప్పటికీ ఆ స్వామికి మొక్కుకుంటే వెంటనే ఆ గండం నుంచి బయట పడేస్తాడని విశ్వసిస్తుంటారు. ఇందుకు ఎన్నో నిదర్శనాలు కూడా వున్నాయి. విశాఖపట్నంలోని ‘శృంగమణి’ పర్వతంపై కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వరస్వామి కూడా ఇందుకు ఉదాహరణగా కనిపిస్తుంటాడు.
పూర్వం ఆంగ్లేయులు నౌకాయానం ద్వారా ఇక్కడ వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఆ సమయంలో ఒకరోజు సముద్రం మధ్యలో ఓడ వుండగా హఠాత్తుగా తుపాను ప్రారంభమైందట. అందులో వున్న హిందూ … ముస్లిం … క్రిష్టియన్ మతస్తులు తాము సురక్షతంగా తీరానికి చేరుకుంటే, తమ ఇష్ట దైవాల మందిరాలను ఇక్కడి పర్వతంపై నిర్మిస్తామని ప్రార్ధించారు. వారి ప్రార్ధనలు ఫలించి అంతా క్షేమంగా తీరానికి చేరుకున్నారు.
ఆ సమయంలోనే నౌక అడుగుభాగాన ఏదో రాయి అడ్డుపడినట్టుగ్గా అనిపించడంతో వెలికితీసి చూశారు. అది శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహంగా గుర్తించి దానిని ఇక్కడి పర్వతంపై ప్రతిష్ఠించారు. కాలక్రమలో ఈ ఆలయం అభివృద్ధి చెందడం … ఆ పక్కనే ముస్లిములు దర్గాను … క్రిష్టియన్లు చర్చిని ఏర్పాటు చేసుకోవడం జరిగాయి. గర్భాలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి నిండుగా … కనుల పండుగగా కొలువుదీరిన ఈ క్షేత్రానికి పాలకుడిగా హనుమంతుడు వ్యవహరిస్తున్నాడు. విశాలమైన ఆలయ ప్రాంగణం … అందంగా తీర్చిదిద్దిన ముఖమంటపం … వరుసగా కొలువుదీరిన దశావతార మూర్తులు ఆలయ వైభవానికి అద్దం పడుతుంటాయి.
ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణోత్సవాలు … లక్ష కుంకుమార్చనలు … లక్ష తులసి పూజలు జరుగుతూ వుంటాయి. పర్వదినాల సమయంలో స్వామివారిని దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగా వుంటుంది. మతసామరస్యానికి వేదికగా … ఆధ్యాత్మిక అనుభూతుల మాలికగా అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం మనసుపై మరువలేని ముద్ర వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు